సచివాలయం కన్వీనర్లు, గృహసారధులు, వాలంటరీలు జగనన్న సైన్యంగా పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి రోజా తెలిపారు. నగరిలోని మంత్రి కార్యాలయం ఆవరణంలో శనివారం జరిగిన పుత్తూరు మున్సిపాలిటీ లోని సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు మరియు వాలంటీర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంతో అభివృద్ధి చేశారని, ఆ అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ప్రతి గ్రామ సచివాలయానికి వైస్సార్సీపీ తరపున ముగ్గురు కన్వీనర్లను నియమించారని, వీరిలో ఇద్దరు పురుషులు ఒకరు మహిళ ఉన్నారన్నారు. ప్రతి ఇద్దరు గృహ సారథులలో ఒకరు పురుషుడు, ఒక మహిళ ఉన్నారన్నారు. ఈ నియమించబడిన కన్వీనర్లు గృహ సారధులు 2 రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను కలవాలన్నారు.
సచివాలయాలకు ఎంపిక చేసిన పార్టీ కన్వీనర్లు కూడా గడపగడపకు తిరగాలని కోరారు. సచివాలయ పరిధిలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడానికి వీరు పని చేస్తారన్నారు. వైస్సార్సీపీపై అభిమానం కలిగి ఉత్సాహంగా, చక్కగా పనిచేస్తూ ఓపికతో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు వారికి వివరించే వారినే నియమించామని అన్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఉచిత బీమా సౌకర్యం కూడా ఉచితంగా కల్పిస్తున్నందున గృహ సారధులు బాధ్యతగా పనిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, రాష్ట్ర బోర్డ్ డైరెక్టర్లు, కో ఆప్షన్ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు గృహ సారథులతో పాటు వాలంటరీలు మరియు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.