మనిషి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తూ, నిండు ప్రాణాలు బలిగొంటున్న కేన్సర్ వ్యాధిని సమూలంగా నాశనం చేసేందుకు సమాజంలో అన్ని వర్గాలు కలిసికట్టుగా ముందుకు రావాలని స్వచ్చంద సేవకులు పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జెమ్స్ ఆసుపత్రి కేన్సర్ విభాగం మరియు స్టార్ వాకర్స్ క్లబ్, రోటరీ క్లబ్ లు సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో వారు అంతా ప్రతిజ్ఞ చేయించారు. కేన్సర్ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గుండె జబ్బులు తర్వాత అతిప్రమాధమైన వ్యాధి కేన్సర్ అని ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎన్. రవేంద్ర అన్నారు. కేన్సర్ అనేది అసాధారణ కణాలు పెరగడం వల్ల వస్తుందని అన్నారు. ఆరోగ్య నియమాలను, పాటిస్తూ నిత్యం వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలని డాక్టర్ రవీంద్ర సూచించారు.
మద్యపానం, దూమపానం కు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి, దురలవాట్లు ఇలా ఎన్నో కారణాలతో కాన్సర్ బాధితులు రోజు రోజుకీ పెరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులు కంటే మహిళలను కాన్సర్ కారకాలు మరింత పెద్దఎత్తున వేధిస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేన్సర్ వ్యాధి నివారణకు జెమ్స్ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. గడిచిన రెండేళ్లలో కాన్సర్ రోగులు పెరుగుతున్నారని, దీని నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకంటే ముందు క్యాన్సర్ పై వాకర్స్ కు, క్రీడాకారులకు అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ జి. ఇందిరాప్రసాద్, రోటరీ ప్రతినిధి , ప్రముఖ సామాజికవేత్త మంత్రి వెంకటస్వామి, జెమ్స్ మెడికల్ కాలేజీ ప్రతినిధులు డాక్టర్ డి. ప్రవీణ్, ఆబోతుల రామ్మోహన్ రావు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఐకె. రావు, వూన్న నాగభూసన్, కిల్లారి రవి , జామి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.