రాష్ట్రంలో ఎన్నికలకు ఎపుడైనా సిద్దమేనని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మళ్లీ నియోజకవర్గాలవారీగా ఫోకస్ పెట్టారు.. మరోసారి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంఛార్జ్‌లు లేని చోట్ల కొత్తవారిని నియమించారు.. తాజాగా నాలుగు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేరకు నియామకాలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నియోజకవర్గ ఇంఛార్జ్‌లను నియమించినట్లు తెలిపారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం బాధ్యతల్ని యనమల దివ్య కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఇంఛార్జ్ గా కర్రోతు బంగార్రాజును నియమించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి గంటి హరీశ్ మాథుర్, కో-కన్వీనర్‌గా నామన రాంబాబును ద్విసభ్య కమిటీ నియమించారు.
ఈ నియామకాల్లో కూడా తుని నియోజకవర్గం విషయంలో అధిష్టానం నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు తుని బాధ్యతల్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు చూశారు. ఇప్పుడు అనూహ్యంగా ఆ బాధ్యతల్ని రామకృష్ణుడి కుమార్తె దివ్యకు అప్పగించారు. మరి ఈ నియామకంపై కృష్ణుడు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
తుని సీటు విషయంలో కూడా యనమల సోదరుల మధ్య విభేదాలు వచ్చాయి. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని టీడీపీ సీటు ఇస్తారనడంతో.. కృష్ణుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. అందులో.. యనమల కృష్ణుడు కష్టపడితే కూతురుకు సీటు ఇస్తారా అని అడగాలని కార్యకర్తల్ని కోరారు. ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించాలని.. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని గట్టిగా చెప్పాలన్నారు. దివ్య ఇంట్లో ఉంటుందని.. యాదవ సంఘంలో 30వేల ఓట్లు ఉన్నాయని.. తాను లేకపోతే ఎవరు చూడరని వ్యాఖ్యానించారు.