ఇటీవల గేల వివాహాలు పెద్ద ఎత్తున్న చర్చాంశనీయంగా మారాయి. తాజాగా వివాహానికి అనుమతి కోరుతూ స్వలింగ సంపర్క జంట సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత 15 ఏళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని, పెళ్లికి అనుమతించాలని ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా అనే ఇద్దరు యువకులు సుప్రీంకోర్టును కోరారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వీరు.. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంటతో పాటు మరో ముగ్గురు తమ వివాహాలకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటినీ మార్చిలో విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఒకవేళ ఈ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే.. తైవాన్ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్ నిలుస్తుంది.
ఉత్కర్స్, కోటియాలు 2008 నుంచి ప్రేమలో ఉన్నారు. సంప్రదాయవాద దేశమైన భారత్‌లో స్వలింగసంపర్కానికి ఆమోదం లేకపోవడంతో ప్రజల దృక్పథాలు ఎలా మారతాయో? అని వేచిచూశామని ఈ జంట తమ పిటిషన్‌లో పేర్కొంది. తదుపరి పరిణామాలపై చాలా ఆందోళనకరంగా ఉన్నామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ స్కాలర్‌గా ఉన్న ఉత్కర్ష్ సక్సేనా అన్నారు. “మేము చాలా దుర్బల పరిస్థితిని ఎదుర్కొంటున్నాం.. ఏదో ఒక కోణంలో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.
ఇటీవల కాలంలో భారతీయ సమాజం క్రమంగా స్వలింగ సంపర్కానికి ఆమోదం తెలుపుతూ ఉండటంతో LGBTQ వ్యక్తులు తమ లైంగికతను బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్సేనా, కోటియాలు తమ సంబంధం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి చాలా మంది అంగీకరించినట్టు పేర్కొన్నారు. ‘‘మా సంబంధం సామాజిక కోణంలో చాలా కాలంగా ఆమోదం లేదు.. అది ఇప్పుడు ఇతర జంటల సంబంధం మాదిరిగానే స్వీకరించాలని మేం కోరుకుంటున్నాం’’ అని వివరించారు.
స్వలింగ సంపర్కం అసహజ లైంగిక చర్య కాదని, కాబట్టి ఇది భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కిందికి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ దీపక్ మిశ్రా సహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ గతేడాది మార్చిలో తీర్పు వెల్లడించింది. గే సెక్స్ నేరం కాదని, అది సెక్షన్ 377 కిందకు రాదని ఐదుగురు జడ్జిలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని జస్టిస్ మిశ్రా వెల్లడించారు. సమాజంలో స్త్రీ, పురుషులకు సమానమైన హక్కులే ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఉంటాయని జస్టిస్ మిశ్రా స్పష్టం చేశారు. సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం చట్టరిత్యా నేరం కాదని, అది చట్టబద్ధమని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నారు.