దేశం ఎంతో పురోగమిస్తున్నా ఇంకా మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఆ తరహా సామాజిక చైతన్యం కనిపించడంలేదు. వైద్యరంగం ఎంతో పురోగతి సాధించిన ఈ రోజుల్లోనూ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, న్యూమోనియాతో బాధపడుతున్న ఓ మూడు నెలల చిన్నారికి ఐరన్ రాడ్‌తో కాల్చి వాతలు పెట్టిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి కడుపుపై 51 సార్లు వాతలు పెట్టడంతో భరించలేక ప్రాణాలు కోల్పోయింది. అత్యంత విషాదకర ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో చోటుచేసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. పొట్టపై వాతలు పెట్టడం వల్ల చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్చించారు. 15 రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఆస్పత్రిలో కన్నుమూసింది.
చిన్నారి మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఖననం చేశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో శనివారం మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. షాడోల్ జిల్లా కలెక్టర్ వందన వైధ్ మాట్లాడుతూ.. ‘‘మహిళా, శిశు అభివృద్ధి అధికారులు ఆసుపత్రికి వెళ్లారు.. 15 రోజుల కిందట ఈ షాకింగ్ ఘటన జరిగింది.. శిశువుకు న్యుమోనియాకు చికిత్స అందకపోవడం వల్ల పరిస్థితి క్షీణించిందని గుర్తించారు’’ అని తెలిపారు.
పాపకు గుడ్డి నమ్మకంతో వాతలు పెట్టొద్దని ఆమె తల్లికి స్థానిక అంగన్వాడీ కార్యకర్త అభ్యర్ధించి.. కౌన్సెలింగ్ ఇచ్చారని కలెక్టర్ చెప్పారు. ఇదిలా ఉండగా, గిరిజన ప్రాబల్యం ఉన్న మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో న్యూమోనియాకు ఐరన్ రాడ్‌తో కాల్చి వాతలు పెట్టడం సర్వసాధారణం. ‘‘కడ్డీలతో వాతలు పెట్టడం మరణానికి దారి తీస్తుంది.. ఇది నొప్పిని తగ్గించడానికి ఒక మార్గం.. కానీ సమస్య ఏమిటంటే ఇన్ఫెక్షన్ తగ్గడం కంటే మరణానికి కారణం అవుతుంది’’ అని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, డాక్టర్ విక్రాంత్ భూరియా అన్నారు. దీనిపై మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేశ్ వాజ్‌పేయీ మాట్లాడుతూ.. ‘‘అటువంటి అమానుష చికిత్సలు ఇప్పటికా ప్రబలంగా ఉన్నాయి.. దీనిపై మెడికల్ ఆఫీసర్లు స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.