సీపీఎస్ రద్దు అంశం వైసీపీ సర్కార్ కు పెద్ద సవాల్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా సంకల్ప దీక్షలు చేపట్టారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం చర్చి కూడలి వద్ద సంకల్ప దీక్షకు దిగారు. సీపీఎస్ బదులు జీపీఎస్ తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతుండటం అంగీకార యోగ్యం కాదని ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు.
మరోవైపు వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజా ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష చేపట్టారు. సీపీఎస్ రద్దు చేస్తారా? లేదా? అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని లక్ష్మీరాజా డిమాండ్ చేశారు. అలాగే, విజయవాడలోని యూటీఎఫ్ కేంద్ర కార్యాలయం ఆవరణలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్షకు దిగారు. ఈ నెల మూడో తేదీన గన్నవరంలో సంకల్పదీక్ష తలపెడితే.. అనుమతించకపోగా, ఉపాధ్యాయుల్ని అక్రమంగా అరెస్టు చేశారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
నెల్లూరు యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద కూడా ఉపాధ్యాయులు సంకల్ప దీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 5వ తేదీ వచ్చినా.. ఇంకా జీతాలు వేయలేదని ఉద్యోగులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో పోరాటాలను అణిచివేస్తోందని ఆరోపించారు.