ఏపీలోని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో నారా లోకేశ్ పదో రోజు పాదయాత్ర కొనసాగుతోంది. ఉదయం తవనంపల్లె నుంచి ప్రారంభమైన యాత్ర.. తవనంపల్లె, ఐరాల మండలాల మీదగా సాగుతోంది. కాణిపాకంలో ముస్లిం మైనారిటీలతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తానని తెలిపారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. కాణిపాకం వరసిద్ధి వినాయకుణ్ని దర్శించుకున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్‌కు మహిళలు హరతులు పట్టి, టీడీపీ శ్రేణులు అడుగడుగున పూలమాలలు వేస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం తవణంపల్లి విడిది కేంద్రంలో గాండ్ల సామాజిక వర్గీయులతో సమావేశమయ్యారు.