కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికులు, రైతులను నిలువునా ముంచడానికి సిద్ధమైందని, దీనిని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 5వ తేదీన చేపట్టిన చలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పుట్టపర్తిలోని సిఐటియు కార్యాలయంలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘం అధ్యక్షుడు పెద్దన్న, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, సిఐటియు అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేసిందన్నారు.
దేశవ్యాప్తంగా రైతులు వ్యవసాయ నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేస్తున్న కేంద్రం ప్రభుత్వం రైతుల పంట రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు.. కేరళ తరహాలో రైతు రుణ వివేచన చట్టం తీసుకువచ్చి రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఆపాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. రైతులపై బనాయించిన అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఉత్పత్తి ఖర్చులు అదనంగా 50 శాతం కలిపి అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలన్నారు.
జిల్లాలో రైతుల పంటలను ఆర్‌బికె కేంద్రాల్లో కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. కార్మికులకు నెలకు రూ. 26 వేలు కనీస వేతనం, రూ. 10 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. పేద, మధ్య తరగతి రైతు, వ్యవసాయ కార్మికుల అప్పులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన వారందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక, రైతాంగ సమస్యలపై ఏప్రిల్ 5 వతేదీన చేపట్టాన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం. ఇంతియాజ్, సిఐటియు అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్. వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టి. ప్రవీణ్ కుమార్, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.