టీడీపీకి ఇది విషాధకరమైన వార్త. చంద్రబాబు ప్రాణ స్నేహితుడు, టీడీపీ సీనియర్ నేత, తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్‌రెడ్డి కన్నుమూశారు. ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కొద్ది రోజుల క్రితం గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ అక్కడే ప్రాణాలు విడిచారు. శంకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని శంకర్‌రెడ్డి నివాసంలో పార్థివదేహానికి డిప్యూట సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి పరసారత్నం, టీడీపీ నేతలు నివాళులు అర్పించారు.
శంకర్‌రెడ్డి మృతి తనను కలిచివేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన శంకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని.. యూనివర్సిటీ స్థాయి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదన్నారు. తిరుపతి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కందాటి తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించారని.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించి ఓదార్చారు.
చంద్రబాబు, శంకర్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో.. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్‌లో ఉన్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. శంకర్ రెడ్డి 2002లో శంకర్‌రెడ్డి విజయం సాధించి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. తిరుపతి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిపై విజయాన్ని అందుకున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుత్తూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శంకర్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. గత ఎన్నికల సమయంలో తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.