కర్ణాటక రాష్ట్రం నిర్మిస్తున్న భద్ర ఎగువ ప్రాజెక్టు ద్వారారాయల సీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5300 కోట్లు కేటాయించడంతో పాటు జాతీయ హెూదా కల్పించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంవి సుబ్బారెడ్డి, కొమ్మద్ధి ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఆదివారం వారు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మద్య చిచ్చుపెట్టేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. తుంగభద్ర నదిపై ఎగువ భద్ర అనే ప్రాజెక్టు ద్వారా మొదటి దశలో 17. 4 టీఎంసీలు, రెండవ దశలో 29. 9 టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతానికి తరలించడం వల్ల తుంగభద్ర డ్యాం దిగువ ప్రాంతంలో ఉన్న ఎల్ఎల్సి హెచ్ఎల్సి, పోతిరెడ్డిపాడు, రాజోలు బండ, డైవర్షన్స్ స్కీమ్ ప్రాజెక్టులకు నీరు అందదని తద్వారా రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే అవకా శాలు పుష్కలంగా ఉన్నాయని వారు గుర్తుచేశారు. దిగువ ప్రాంతం లో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందకుండా పోయే ప్రమాదం నెలకొంటుందని వారు గుర్తుచేశారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల మద్య చిచ్చుపెట్టేలా వ్యవహరించడం మానుకోవాలని లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన దశలవారీ ఉద్యమానికి సిద్దపడతామని వారు హెచ్చరించారు.