ఈనెల 26వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు , జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే చాలా వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏపీ జేఏసీ అమరావతి మూడవ రాష్ట్ర మహాసభలు కర్నూలులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులతోపాటు కాంట్రాక్ట్, హౌస్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా బొప్పరాజు మాట్లాడుతూ.... మూడున్నరేళ్ల నుంచి తమ సమస్యలు పరిష్కరం కాలేదని, అందులో రెండేళ్లు కరోనా అని తాము కూడా ఏం మాట్లాడలేదన్నారు. గత ఏడాది ఛలో విజయవాడ తర్వాత సీఎం జగన్ ఇచ్చిన హామీలు.. ఆర్థిక, ఆర్థికేతర.. ఏ సమస్యలు కూడా ఇంత వరకు పరిష్కారం కాలేదన్నారు. తమ ఆవేదన మాటల్లో చెప్పలేమని అన్నారు.