1998 మెమో రద్దు కోరుతూ దళిత క్రైస్తవులు కొంతకాలంగా సాగిస్తున్న ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లభించింది. దళితులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారికి రిజర్వేషన్లు వర్తించకుండా నిరోధించే ఈ మెమోను రద్దు చేయాలన్న డిమాండ్ ఈమధ్య ఊపందుకుంది. చీరాలకు చెందిన సీనియర్ దళిత క్రైస్తవ నేత, ప్రజా వేదిక అధ్యక్షుడు గుమ్మడి ఏసు రత్నం తదితరులు ఇదే విషయమై పలు రకాలుగా సదస్సులు, సమావేశాలు, ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు వీలుగా 1998 మేమోకు సంబంధించి సమగ్ర సమాచారం అంద చేయాల్సిందిగా సీఎమ్ఓ చీఫ్ అడిషనల్ సెక్రటరీ భరత్ గుప్తా దళిత క్రైస్తవుల సంఘం నేతలను కోరినట్లు నీలం శ్యాం, గుమ్మడి ఏసు రత్నం, ప్రొఫెసర్ రమేష్ తదితరులు మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ సాయంత్రానికల్లా సమాచారం పంపాల్సి ఉన్నందున అన్ని దళిత క్రైస్తవ సంఘాలు ఈ మెమోకు సంబంధించి తమ వద్ద అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని వెంటనే తమకు అందజేయాలని వారు కోరారు.