పార్వతీపురం జిల్లాలో మొబైల్ టవర్లను జూన్ నాటికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాకు కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ 182 మొబైల్ టవర్లను మంజూరు చేసింది. మంజూరు అయిన టవర్లలో ఎయిర్ టెల్ కు 34, జియోకు 75, బి. ఎస్. ఎన్. ఎల్ కు 73 ప్రదేశాల్లో టవర్ల నిర్మాణానికి కేటాయించారు. ఇందులో జియ్యమ్మవలస మండలంలో 7, కొమరాడ మండలంలో 21, గుమ్మలక్ష్మీ పురం మండలంలో 52, కురుపాం మండలంలో 32, పాచిపెంట మండలంలో 18, సాలూరు మండలంలో 21, సీతంపేట మండలంలో 27, మక్కువ మండలంలో 2, భామిని, పార్వతీపురం మండలాల్లో ఒక్కొక్కటి నిర్మించనున్నారు. నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం అధికారులు, మొబైల్ ఆపరేటర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాను అభ్యుదయ (ఆస్పిరషనల్ ) జిల్లాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడటం వలన జిల్లా అభివృద్ధికి నాంది పడుతుందని ఆయన పేర్కొన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చి, జిల్లా రూపురేఖలు మారుతాయని అన్నారు. మారు మూల గ్రామాల్లో టెలి మెడిసిన్ వంటి వ్యవస్థల ఏర్పాటుకు దోహదం చేస్తుందని, గ్రామ సచివాలయం వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయుట అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.
వీటి దృష్ట్యా జూన్ నాటికి టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. వర్షా కాలం ప్రారంభం తరువాత పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎయిర్ టెల్ కు 22 స్థలాలు, జీయోకు 48 స్థలాలు, బి. ఎస్. ఎన్. ఎల్ కు 53 స్థలాలు అప్పగించడం జరిగిందని వాటిలో ప్రాథమిక పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. టవర్ల నిర్మాణంలో అవసరమగు సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగం అందించుటకు సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో అవసరమైతే గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం అధికారుల సహాయ సహకారాలు తీసుకుని పనులు వేగవంతం చేయాలని అన్నారు.
అటవీ ప్రాంతంలో నిర్మాణాలపై ఐటిడిఎ ప్రాజెక్టు అధికారుల ద్వారా అటవీ శాఖకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన సూచించారు. బి. ఎస్. ఎన్. ఎల్ పనులు తక్షణం ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఎయిర్ టెల్ నెట్ వర్క్ మెరుగు పరచాలని ఆయన చెప్పారు. ఎయిర్ టెల్ 25 ప్రదేశాల్లో పనులు ప్రారంభించడం జరిగిందని, 7 చోట్ల అటవీ శాఖ అనుమతులు అందాల్సి ఉందని ఎయిర్ టెల్ ప్రతినిధులు వివరించారు. జియో 44 ప్రదేశాల్లో పనులు ప్రారంభించడం జరిగిందని, ఆరు ప్రదేశాలు వెళ్ళుటకు అవకాశం లేనివిధంగా ఉన్నాయని, వాటి స్థలాలు మార్పు చేయాలని జియో ప్రతినిధులు వివరించారు. బి. ఎస్. ఎన్. ఎల్ పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికార్లు డా. బి. నవ్య, సి. విష్ణు చరణ్, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, ఎయిర్ టెల్, బి. ఎస్. ఎన్. ఎల్, జియో ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.