తిరుమల కొండ మెట్లు ఇక సర్వాంగ సుందరంగా మారనున్నాయి. ఏడున్నర కిలో మీటర్లలో ఉన్న తిరుమల కాలిబాటను.. మరింత అభివృద్ధి చేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 25 కోట్ల రూపాయల ఖర్చుతో.. పాడైపోయిన షెల్టర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త షెల్టర్లను ఏర్పాటు చేశారు. నడకదారిలో భక్తులకు అవసరమైన విశ్రాంతి సముదాయాలు, టాయిలెట్స్, తాగునీటి జలప్రసాద కేంద్రాలను అవసరమైన దగ్గర ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న షెల్టర్లను పిల్లర్లతో సహా తొలగించి.. వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించింది. నడకదారి లో భక్తుల రద్దీ తక్కువగా సమయంలో.. మరమ్మతు పనులను వేగంగా చేపట్టింది. దీంతో ప్రముఖులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయడంపై.. ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 'తిరుమలకు వెళ్లే నడకదారిని చక్కగా అభివృద్ధి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలికి అభినందనలు. చాలా దేవాలయాల్లో భక్తులు ఇచ్చిన నిధులు బ్యాంకులో ఉన్నాయి. ఆ ఆలయాలకు వాటిని ఉపయోగిస్తే మంచిది' అని విష్ణువర్థన్ రెడ్డి ట్వీట్ చేశారు.
అలిపిరి నుంచి తిరుమల వరకు మొత్తం 3 వేల 550 మెట్లు ఉంటాయి 7.5 కిలో మీటర్ల దూరమున్న నడక దారిలో.. చివరి మెట్టు వరకు కూడా భక్తులు తడవకుండా షెల్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నడకదారిపై భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకపోయినా.. అక్కడక్కడా పాడవడం, వర్షం వస్తే భక్తులు తడిచే అవకాశం ఉండటంతో.. నడకదారిని అభివృద్ధి చేయాలని టీటీడీ మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టింది. అధునాతన సౌకర్యాలతో కూడిన నడకదారిని అందుబాటులోకి తీసుకొచ్చింది.