తన పార్టీ కార్యాలయం తగలబెట్టిన ఘటన వెనక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఈ పని చేశారని ఆరోపించారు. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హస్తం ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆరోపించారు. ఇదిలావుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ పార్టీ కార్యాలయం కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత గుంటూరు డొంకరోడ్డులో ఉన్న ఆఫీసును దుండగులు తగులబెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్ మొత్తం బూడిదయ్యింది. ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించి తనపై దాడి చేసినట్టు అక్కడి వాచ్ మెన్ చెబుతున్నాడు. బొరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
ఈ ఘటనపై అనిల్ కుమార్ స్పందించారు. సీఎం జగన్ ఈ ఘటనపై విచారణ జరిపి.. తనతో పాటూ కుటుంబానికి భద్రతను కల్పించాలని కోరారు. రెండు రోజుల క్రితం కొందరు టీడీపీ నేతలు తన పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి బెదిరించారని గుర్తు చేశారు. ఈ నెల 5న సాయంత్రం సౌపాటి రత్నంతో పాటూ కొంతమంది పార్టీ ఆఫీస్ పై దాడికి వచ్చారని అనిల్ వర్గం చెబుతోంది.
బోరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేతగా.. అలాగే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ చేసిన ఆడియో వైరల్ అయ్యింది. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నెల్లూరు అంగళ్ల దగ్గర బండికి కట్టుకుని లాక్కెళతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.. తన గొంతు ఆగదన్నారు.
కోటంరెడ్డికి మళ్లీ అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వంటి వ్యక్తులు సీఎం జగన్ గోటి మట్టితో సమానమని.. జగన్ కోసం తాను చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని ఘాటుగా స్పందించారు. చంద్రబాబు తన బినామీ సొమ్ముతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను లాక్కోవాలనే ప్లాన్ చేస్తున్నారని.. ఎవరు అసలైన నాయకుడో, ఎవరు మోసం చేసారో అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారన్నారని కామెంట్ చేశారు. తనకు వార్నింగ్ ఇచ్చేంత దమ్ము కోటంరెడ్డికి లేదన్నారు.
మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే కోటంరెడ్డిని కుక్కను కొట్టినట్టు కొట్టి.. రోడ్డున ఈడ్చుకొస్తానని మరోసారి హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీలో టికెట్లు రావని తెలిసే కొందరు ఇలా అసమ్మతి పేరుతో డ్రామాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. జగన్ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో బోరుగడ్డ అనిల్ కుమార్ పార్టీ కార్యాలయం దగ్గరకు కొంతమంది టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. అనిల్ దమ్ముంటే బయటకు రావాలని నినాదాలు చేశారు.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఇప్పుడు తాజాగా అనిల్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది.