రాజు ఎక్కడ ఉంటే అదే రాజధాని కాదని, దీన్నొక మానసిక రుగ్మత అంటారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని విశాఖపట్నంకు మార్చడంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఎంపీ రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాజధానిని మారుస్తున్నారటగా అని హేళనగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ దుకాణం సర్దేస్తున్నారనే వార్తలు చూస్తున్నామన్నారు. ఎవరైనా రాజధానిలో ఉంటామని అంటారు గాని.. రాజధానిలో ఉండను అనే వారిని ఇప్పుడే చూస్తున్నానని వ్యాఖ్యానించారు.
రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన రెండు రోజులకే ఆయన తమ్ముడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు విచారించారని ఎంపీ రఘురామ గుర్తు చేశారు. మరికొందరికి రేపోమాపో సీబీఐ నోటీసులిచ్చే అవకాశముందన్నారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును డైవర్ట్ చేయడానికే సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారా? లేక విశాఖపట్నంపై ప్రేమతో వస్తున్నానని చేబుతున్నారా.. అన్నది అర్థం కావడం లేదన్నారు. ఈ వార్తల నేపథ్యంలో అమరావతిలో అల్లకల్లోలంగా ఉందని.. విశాఖపట్నం వాసుల్లో భయాందోళన నెలకొందని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సీఎం జగన్ విశాఖపట్నం వెళ్తే, రాష్ట్ర గవర్నర్‌కు కూడా అక్కడే భవనం చూస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
రాజధాని అంశంలో సుప్రీం కోర్టు తీర్పు రాబోతోందని.. అంత వరకు ఆగాలని ఎంపీ రఘురామ అన్నారు. రైతులను వంచించి వెళ్తే బాగోదన్నారు. రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు విశాఖపట్నం అంతలా నచ్చితే వీకెండ్‌కి వెళ్లాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీని వదిలేసి.. వారణాసి నుంచి పరిపాలన చేస్తానంటే బాగోదు కదా అని వ్యాఖ్యానించారు.