వరుసగా భూకంపాలు టర్కీ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే టర్కీలో వరుసగా మూడు భూకంపాలు సంభవించగా.. మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైనట్లు యూరోపియన్ మెడిట్టేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. సెంట్రల్ టర్కీ పరిధిలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భూప్రకంపనలకు బిల్డింగ్‌లు, రోడ్లకు బీటలు పడ్డాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ప్రస్తుతం టర్కీ, సిరియాలో వరుస భూకంపాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. పెను భూకంపాల ప్రభావానికి పెద్ద పెద్ద బిల్డింగులు పేకమేడల్లా కుప్పకూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రజల అవస్థలు, చిన్నారులు శిథిలాల మధ్యలో కూర్చుని భయపెడుతున్న దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. ఇప్పటివరకు 4,300 మందికిపైగా టర్కీ, సిరియాలో మరణించగా.. శిథిలాల కూడా వేలమంది చిక్కుకున్నారు. వీరిని బయటకు తీయడానికి మరికొద్ది రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
వరుస భూకంపాలు సంభవిస్తుండటంతో.. ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బిల్డింగ్‌లు ఎప్పుడు కూలుతాయో తెలియక భయపడుతున్నారు. వరుస భూకంపాలతో విలవిలలాడుతున్న టర్కీ, సిరియాలకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. భారత్ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించగా.. స్పెయిన్ శిథిలాలలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్పిఫర్ డాగ్‌లను పంపించింది.
ఇక ఇజ్రాయెల్ రెస్క్యూ టీమ్‌లను టర్కీకి పంపించగా.. టర్కీ, సిరియాలకు సహాయం అందిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. మృతులకు నివాళిగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా టర్కీ ప్రకటించింది. 1939 తర్వాత తమ దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. దాదాపు 2,800 బిల్డింగ్‌లు భూకంపాల దెబ్బకు కుప్పకూలినట్లు తెలిపారు. శిథిలాల కింద ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి.