ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనో నియంత అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇదిలావుంటే ఆయన ఆరోగ్యం గురించి మరోసారి అంతర్జాతీయ మీడియాలో ఊహాజనిత కథనాలు వెలువడుతున్నాయి. అత్యంత ముఖ్యమైన సైనిక కవాతులకు కొద్ది రోజుల ముందు నుంచి ఆయన బయట ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆరోగ్యం విషమించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్యాంగ్ యాంగ్‌లో ఈ వారంలో కొన్ని మాస్ పెరేడ్స్ నిర్వహించాలని ముందుగానే నిర్ణయించారు. కానీ, ఈ పెరేడ్స్‌కు ఆయన హాజరవుతారా? అనేది సందేహమే. దాదాపు ఓ నెల రోజుల నుంచి కింగ్ జోంగ్ ఉన్ బహిరంగంగా కనిపించడం లేదు. ఆదివారం జరిగిన కీలక పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడా కిమ్ గైర్హాజరయ్యారు. ఇప్పటి వరకూ ఆయన కేవలం మూడుసార్లు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనలేదు.
అమెరికన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్ ఆదివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశానికి గైర్హాజరయ్యారు. సుదీర్ఘ కాలం ఉత్తర కొరియా అధినేత బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం గురించి సందేహాలు తలెత్తుతున్నాయి. కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక దినోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం లేదా బుధవారం భారీ ఎత్తున్న సైనిక కవాతు నిర్వహించాల్సి ఉంది. గతంలో ఈ కవాతుల సందర్భంగా ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించేవారు.
ఇదిలావుంటే దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణకు చేస్తున్న ప్రయత్నాలు ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిని దీటుగా ఎదుర్కొంటామని, అణ్వాయుధాల ప్రయోగానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. 2014లో కిమ్ జోంగ్ ఉన్ వరుసగా 40 రోజులపాటు బహిరంగంగా కనిపించలేదు. అమెరికా లేదా దక్షిణ కొరియాలే లక్ష్యంగా గతేడాది అణ్వాయుధ సామర్ధ్యం కలిగినవి సహా 70కిపైగా బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది.