ఐస్‌క్రీమ్ చూస్తేనే దాని మింగేయాలనిపిస్తుంది. కానీ అందులో చనిపోయిన కప్ప కనిపిస్థే...? సాంబార్‌లో బల్లి, బిర్యానీలో బొద్దింక లాంటి వార్తలు వింటుంటే.. హోటళ్లు, రెస్టారెంట్లలో తినేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు తమిళనాడులోని మధురై నుంచి ‘వాంతి చేసుకునే వార్త’ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐస్‌క్రీమ్‌లో చచ్చిపోయిన కప్ప కనిపించింది. అది చూసి చిన్నారి వాంతి చేసుకుంది. తండ్రి వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు.
తమిళనాడులోని మధురైలోని టీవీఎస్ నగర్ కాలనీలో అన్బు సెల్వం అనే వ్యక్తి భార్య జానకిశ్రీ, కుమార్తెలు మిత్రశ్రీ (8), రక్షణశ్రీ (7), ధరణి (4)లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి 5) తమిళుల పర్వదినం ‘తైపూసమ్’ను పురస్కరించుకుని సెల్వం తన కుటుంబ సభ్యులు, సోదరుడి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపరంగునంలోని కుమారస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామి వారి దర్శనం అనంతరం ఉదయం 11 గంటల ప్రాంతంలో వారంతా ఆలయ సమీపంలోని చిన్న కూల్‌డ్రింక్స్ దుకాణానికి వెళ్లారు. పిల్లలు ఐస్‌క్రీమ్ అడగడంతో కొనిచ్చాడు.
పిల్లలు ఐస్‌క్రీమ్ తింటుండగా.. చిన్నారి తింటున్న ఐస్‌క్రీమ్‌లో చనిపోయిన కప్ప కనిపించింది. ఆ విషయాన్ని తండ్రికి చెప్పడంతో, ఐస్‌క్రీమ్‌లో కప్ప ఉండటం చూసి అతడు షాక్ తిన్నాడు. మిగిలిన చిన్నారులు కూడా తాము తింటున్న ఐస్‌క్రీమ్‌ను కింద పడేశారు. సెల్వం దుకాణాదారుడిని నిలదీయగా.. ఐస్‌క్రీమ్ తాను తయారుచేయడం లేదని బదులిచ్చాడు. సెల్వం ఆ చిన్నారులందరినీ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వారికి చికిత్స అందించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ ఆలయం ప్రాంగణంలోని షాపుల్లో ఐస్‌క్రీమ్ తిన్నవారందరూ ఆస్పత్రికి పరుగులు తీశారు.
ఐస్‌క్రీమ్‌లో కప్ప వచ్చిన ఘటనపై సెల్వం భార్య జానకిశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూల్‌డ్రింక్స్ దుకాణం యజమాని దురైరాజన్ (60)ను అరెస్ట్ చేశారు. ఆహార పదార్థాల తయారీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.