పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం కడపకుదురులో ఐదు కిలోల గంజాయి పట్టివేత కేసులో కుట్ర కోణం ఉందని ముద్దాయి బంధువులు జిల్లా ఎస్పీ జిందాల్ దృష్టికి తెచ్చారు. దీంతో ఈ కేసును అన్ని కోణాల నుండి విచారించాల్సిందిగా చీరాల డిఎస్పి శ్రీకాంత్ ను ఆదేశించారు.నాలుగు రోజుల క్రితం కడవకుదురులో రైల్వే ఉద్యోగి పంది రవి నివాసంలో ఐదు కేజీల గంజాయి దొరికింది అంటూ పోలీసులు హడావిడి చేశారు. అతడిని అరెస్టు చేసినట్టు చినగంజాం ఎస్సై ఒక సెక్షన్ మీడియాకు మాత్రం చెప్పారు.
అయితే ఒక స్థలం విషయంలో రవి కి దాయాదులైన ముగ్గురు సోదరులకు మధ్య వివాదం నడుస్తోందని, ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆ ముగ్గురు సోదరులు కుట్ర చేసి రవి ఇంట్లో గంజాయి పెట్టి వారే పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించారని ముద్దాయి కుటుంబ సభ్యులు చెప్పారు. జిల్లా ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో ఎస్పీ సమగ్ర విచారణ కు ఆదేశించారు.