మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలపాలని ఆయన మనుమడు అల్లూరి శ్రీరామరాజు అన్నారు. మంగళవారం కైకలూరు కూచిపూడి నాట్యరవళి స్కూల్‌ను సందర్శించిన ఆయనను టీచర్ పసుమర్తి శ్రీవల్లి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీరామరాజు మాట్లాడుతూ తన తాతగారు విప్లవ వీరుడుగానే కాక మూలిక వైద్యంలో ప్రావీణ్యం పొందారని, 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో మన్యం ప్రజల కోసం పోరాడుతుంటే ఆయన్ను పట్టుకునేందుకు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో స్వచ్ఛందంగా బ్రిటిష్ పాలకులకు దొరికిపోయారన్నారు. ఆయన త్యాగాలు మరువలేనివన్నారు. కైకలూరు నియోజకవర్గం క్షత్రియ సంఘం గౌరవ అధ్యక్షుడు నంబూరి వెంకటపతిరాజు మాట్లాడుతూ అల్లూరిని చాలా తక్కువమందే చూశారని, అలాంటి మహోన్నత వ్యక్తి వారసుడ్ని గుర్తించి సన్మానించడం అభినందనీయమన్నారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎ.వి. శ్రీనివాసరావు, వై మోజేష్ తదితరులు శ్రీరామరాజును సత్కరించారు. కైకలూరుకు చెందిన డాక్టర్ గంటా సత్యనారాయణ (కాశీ డాక్టర్), క్షత్రియ సంఘం అధ్యక్షుడు పేరిచర్ల రామరాజు, సంఘ నాయకులు పెన్మెత్స త్రినాథరాజు, దండు ప్రసాద్‌రాజు, పీవీ నర్సింహరాజు, ములగపాటి దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు.