రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లిలో ఓటమి తప్పదన్న భయంతోనే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. తిరుమలమ్మపాళెం గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రశాంత్ కిషోర్ ( పీకే )కు చెందిన ఐ ప్యాక్ విడుదల చేసిన సర్వేతోపాటు కాకాణి సొంతంగా నిర్వహించుకున్న సర్వే, తాము నిర్వహించిన సర్వేలోనూ కాకాణికి సర్వేపల్లిలో ఓటమే అని తేలిందన్నారు. అందుకే కాకాణి ఈసారి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ఆరోపించారు. సర్వేపల్లి చరిత్రలో వరుసగా ఎవరూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. సర్వేపల్లిలో అదొక సెంటిమెంట్ అన్నారు. ఈసారి సర్వేపల్లి ప్రజలు తనను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని తేల్చి చేప్పారు. జిల్లాలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారని విమర్శించారు. రాష్ట్రంలో తీరని అన్యాయానికి గురవుతున్న దళితుల పక్షాన పోరాడేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.