రేషన్ సరుకుల రవాణా, పంపిణీలో అక్రమాలకు పటిష్టమైన ఆన్‌లైన్ నిఘా వ్యవస్థ ద్వారా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెలా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని రైస్‌మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల గోడౌన్‌లకు, అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు రవాణా చేస్తున్న క్రమంలో ఒక్కొక్క బియ్యం బస్తా నుంచి 1-2 కేజీల వరకు తగ్గుతున్నాయి. ఈ అక్రమాలను అరికట్టేందుకు విజయవాడలోని పౌరసరఫరాలశాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటరును మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం 9గంటలకు ప్రారంభించనున్నట్లు కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ మంగళవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్లలోని గోడౌన్లు, రైస్‌మిల్లులు, స్టేజ్-1, స్టేజ్-2 రవాణా వాహనాల కదలికలను రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటరు నుంచి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా మానిటరింగ్ చేస్తామన్నారు. ప్రజా పంపిణీ ధాన్యాన్ని మిల్లింగ్ చేసే రైస్‌మిల్లుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.