కడప జిల్లా గోపవరం మండలం వడ్డే అగ్రహారం గ్రామానికి చెందిన గండికోట వెంకటయ్య 30 సంవత్సరాలకు పైగా సౌదీ అరేబియాలో పనిచేసిన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగి వెళ్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో గత నెల 7న మరణించాడు. విమాన టికెట్, జీతంతో సహా మొత్తం డబ్బులు తీసుకున్నాడని.. అందువల్ల తాము మృతదేహం పంపేందుకు అయ్యే ఖర్చు భరించలేమని కంపెనీ యాజమాన్యం చేతులెత్తేసింది. అతని పాస్‌పోర్టులో పేరులో కూడా వ్యత్యాసం ఉండడంతో చట్టపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆందోళనకు గురైన వెంకటయ్య కుటుంబసభ్యులు మంగళగిరిలోని ఏపీ ఎన్నార్టీని ఆశ్రయించారు. ఏపీ ఎన్నార్టీ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ చొరవ తీసుకుని భారతీయ ఎంబసీ సహాయంతో మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.