చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం గోపాలకృష్ణాపురం వద్ద ఎస్ఐ హరిప్రసాద్ మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ03టీఇ 0549 నెంబరు లారీని తనిఖీ చేయగా.. అందులో 20 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ దామోదరం, క్లీనర్ లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ రేషన్ బియ్యం నగరి నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసింది. డ్రైవరు, క్లీనరుతో పాటు లారీ యజమానులపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బియ్యం విలువ రూ.5లక్షలు ఉంటుందని సీఐ ఆశీర్వాదం తెలిపారు.