పురపాలక సంఘ అధికారుల ఫిర్యాదు మేరకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం వెళుతున్న రావిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు అర్ధరాత్రి అవనిగడ్డ, పామర్రులతో పాటు జిల్లాలోని స్టేషన్‌లన్నీ తిప్పి పమిడిముక్కల స్టేషన్‌కు తరలించారు. రావితో పాటు మరికొందరు టీడీపీ నేతలపై సెక్షన్ 341, 353 రెడ్‌విత్ 149 కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం పమిడిముక్కల నుంచి గుడివాడ ఒన్‌టౌన్ స్టేషన్‌కు తరలించడంతో గుడివాడలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు స్టేషన్‌కు తరలివచ్చారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో రావికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. కోర్టు వద్ద పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకుని రావికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ, తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు జిల్లా మొత్తం తిప్పి పమిడిముక్కల స్టేషన్‌కు చేరాక అరెస్టు చేస్తున్నట్టు చెప్పారన్నారు. చివరకు న్యాయమే గెలిచిందన్నారు.