మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి నిడమర్రులో సుమారు రూ. 3కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నిడమర్రులో ఎమ్మెల్యే ఆర్కే పర్యటించారు. నిడమర్రు నుంచి తాడికొండ వరకు లింకు రోడ్డు విస్తరణలో భాగంగా సుమారు 430 మీటర్ల పొడవుతో రూ. 35 లక్షల నిధులతో నిర్మిస్తున్న సిసి డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించారు.
అనంతరం బీసీ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ నిడమర్రు బీసీ కాలనీ గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదని, కనీసం నడిచేందుకు రహదారులు కూడా లేక స్థానిక ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడటంతో పాటు మురుగునీటి సమస్యతోనూ బాధపడేవారని గుర్తు చేశారు. స్థానిక ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో సుమారు రూ. 2. 50 కోట్లతో 8 సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు రెండు కిలో మీటర్ల సీసీ డ్రైయినేజి నిర్మాణ పనులు చేపట్టామన్నారు.
ఆయా నిర్మాణ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం అంబేద్కర్ కాలనీలో సుమారు 2. 5 లక్షల నిధులతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణాన్ని స్థానికుల చేత ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డీఈ కృష్ణారెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.