చోడవరంలో వేంచేసియున్న అతి పురాతన శ్రీ కేశవ స్వామి ఆలయంలో నూతన ఉత్సవ మూర్తులకు ఈనెల 9 10 తేదీల్లో సంప్రోక్షణ , కల్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు అలమండ బంగారయ్య కార్యనిర్వహణ అధికారి ఎస్ వి వి సత్యనారాయణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన ఉదయం 8. 30 గంటలకు విష్వక్షేన పూజతో ప్రారంభమై ఆరాధన, నిత్య, ఉత్సవ, మహాశాంతి హోమాలుతో (3హోమ గుండాలలో) నూతన ఉత్సవ మూర్తుల మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుననీ చెప్పారు. సంప్రోక్షణ అనంతరం ఈనెల 10వ తేదీ శుక్రవారం ఉదయం 8. 46ని. లకు శ్రీ కేశవస్వామి వారికి కల్యాణం మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. కాబట్టి భక్తులు, పురప్రజలు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని చూసి తరించి స్వామివారి తీర్థ, ప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరుతున్నారు.