విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు భూ నిర్వాసితులకు జగన్ ఇచ్చిన మాటా బుట్టదాఖలైంది. టీడీపీ హయాంలో విపక్ష నేతగా ఆ ప్రాంతంలో పర్యటించినపుడు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ పోరాడుతానని హామీ ఇచ్చారు. అవసరమైతే టీడీపీ ప్రభుత్వం సేకరించిన భూములను వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక యథావిధిగా భూములు సేకరించారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు. అటు పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేదు. ఇంకా అక్కడ ఇళ్ల నిర్మాణం జరగక ముందే ఉన్న గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ‘సర్వం త్యాగం చేశాం. అటు పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కొద్దిరోజులు సమయం ఇవ్వండి. స్వచ్ఛందంగా ఖాళీ చేస్తాం’ అని నిర్వాసితులు కాళ్లావేల్లా పడినా అధికారులు కనికరించడం లేదు. యంత్రాలు, వాహనాలను మోహరించి ఇళ్లను కూల్చివేస్తున్నారు. నిర్వాసితుల ఆక్రందనలు పట్టించుకోకుండా కొద్దిరోజులుగా ఇళ్లు ఖాళీ చేసే ప్రక్రియ సాగుతోంది స్థానికులు వాపోతున్నారు.