కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి ఆనుకొని శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో నిర్మించిన చెరువు 168.40 ఎకరాల్లో విస్తరించి ఒకప్పుడు వర్షపు నీటితో కళకళలాడేది. సుమారు 108 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేది. ఆలూరు నీటి అవసరాలు తీర్చేది. మైనర్ ఇరిగేషన్‌శాఖ పర్యవేక్షణలో ఉన్న ఆలూరు చెరువు వర్షాభావంతో వట్టిపోయింది. పట్టణాన్ని ఆనుకొని ఉండడంతో ఈ చెరువు ఫోర్‌షోర్ ఏరియా భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. నిజానికి, ఇవి ప్రభుత్వ భూములని రికార్డులే చెబుతున్నాయి. ఆన్‌లైన్ భూ రికార్డుల వివరాల్లో 1-బీ నమూనా పరిశీలిస్తే.. ఖాతా నం.20000506 పరిధిలో సర్వే నంబర్లు: 161, 164-ఏ,748 కింద 168.40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పట్టాదారుని పేరు, తండ్రి/భర్త కాలమ్‌లో చెరువు అని, పట్టదారునికి ఏ విధంగా సంక్రమించింది అనే కాలమ్‌లో ప్రభుత్వ భూమి అని స్పష్టంగా ఉంది. 2012 ఏప్రిల్ 10న రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ చేశారు. అంటే...ఇది చెరువు భూమే. ఈ స్థితిలో ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత స్థానిక మంత్రి జయరాందే. కానీ, కంచే చేనును మేయడం ఆలూరులో మొదలై పోయింది. మంత్రి జయరాం అనుచరులు, వైసీపీ ముఖ్య నాయకులు కొందరు గతరెండు రోజులుగా ఏకంగా ఎక్స్‌కవేటర్ల ద్వారా చెరువును చదును చేస్తున్నారు. ఇప్పటికే పదుల ఎకరాలు చదును చేసినట్లు సమాచారం. మంత్రి జయరాం, ఆయన సోదరులైన వైసీపీ కీలక నాయకుల అండదండలు ఉండడం వల్లే ఆక్రమణదారులు బరి తెగించినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటు వైపు వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది.