విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డా.కె.బాబ్జీని ప్రభుత్వం నియమించింది. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం రాత్రి దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకాన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. డా.కె.బాబ్జీ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గత నెల 9వ తేదీన ప్రభుత్వం వీసీ ఎంపిక కోసం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. సెర్చ్ కమిటీలో స్విమ్స్ వీసీ వెంగమ్మ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, విశ్వభారతి మెడికల్ కాలేజీ డీన్ నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. మొత్తం 25 మంది వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోగా... డా.కె.బాబ్జీతో పాటు డా.శివరామ్‌రెడ్డి, డా.పెద్దిరెడ్డి వెంకట సుధాకర్ పేర్లను సెర్చ్ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం డా.కె.బాబ్జీని వీసీగా నియమించేందుకు ఆమోదించింది. సోమవారం గవర్నర్‌ను ఆయన కలిసి విధుల్లో చేరే అవకాశం ఉంది. గతంలో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో న్యూరో సర్జరీ విభాగాధిపతిగా ఆయన విధులు నిర్వహించారు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అకడమిక్ డీఎంఈగా, అనంతరం పదోన్నతిపై ఏడాదిన్నర పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసి గత ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన రిటైరయ్యారు.