బాలుడు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన విశాఖపట్నం లోని లక్ష్మీపురం పోర్ట్ కాలనీ లో చోటుచేసుకుంది. దొంగతనం మోపారన్న బాధతో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే రైల్వే పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని తన కుమారుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. తమ కుమారుడి పరిస్థితి చూసి కన్నీరుగా వినిపిస్తున్నారు. తాను ఎందుకు చనిపోవాలనుకుంటున్న విషయాన్ని బాలుడు కాగితంపై రాశాడు. వివరాల్లోకి వెళ్ళితే.... లక్ష్మీపురం పోర్ట్ కాలనీకి చెందిన బాలుడు స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. దగ్గరలో ఉన్న మైదానంలో చెట్టుకు ఉన్న తేనె పట్టును కొట్టేందుకు బాలుడు వెళ్లాడు. అక్కడ సమీపంలోని ఇంటి యజమాని గమనించి బాలుడు దొంగతనం చేయడానికి వచ్చినట్లు ఆరోపణలు చేశారని బాలుడు కాగితంపై రాశాడు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపైకి వెళ్లాడు. వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.