దుమ్ముగూడెం గ్రామంలో జరుగుతున్న శ్రీముత్యాలమ్మ అమ్మవారి జాతరలో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరను ఆలయ కమిటీ, గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా శ్రీముత్యాలమ్మ అమ్మవారి రాష్ట్రం నలుమూలలా ఎంతో ప్రసిద్ది గాంచారు. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ జాతరలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. జాతర ఏడవ రోజు అమ్మవారిని నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అమ్మవారిని అలంకరించారు.
సారపాక వాస్తవ్యులు మేడారం హనుమాన్రెడ్డి దంపతులు, భద్రాచలం వాస్తవ్యులు గొర్సా నాగరాజు, వాణి దంపతులు, దల్లి ఆనందప్రభాకర్ రెడ్డి, శివలీలదంపతులు, వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన నూతన పట్టు వస్త్రాలు, పూలమాలలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో దుమ్ముగూడెంకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం సాంసృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఫ్రేం పల్సర్బైక్ ఝాన్సీ, రమేష్ మాస్టర్ ఆధ్వర్యంలో బాలు రైడర్స్ అనే డ్యాన్స్ హంగామా కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. అమ్మవారి జాతర ఈ నెల 14వ తేదీ ముగియనుండడంతో భక్తులు తమ మొక్కుబడులను అమ్మవారికి చెల్లించాల్సిందిగా ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్రెడ్డి విజ్ఞప్తి చేశారు.