విజయవాడ వించిపేటలో ఆదివారం రాత్రి ఒక పైచాచిక ఘటన జరిగింది. ఓ వివాహితను ఈవ్‌టీజింగ్ చేయడమే కాకుండా ఆమెపై చాకుతో ఇష్టానుసారంగా అన్నదమ్ములు దాడిచేశారు. వారికి మరో నలుగురు సహకరించారు. వివరాల్లోకి వెళ్ళితే... వించిపేట వినాయకుడి ఆలయం వద్ద కొండ మీద ఎర్రంశెట్టి నందిని కుటుంబంతో నివసిస్తున్నది. ఆమె భర్త విష్ణు వడ్డీ వ్యాపారి. నందినితోపాటు మావయ్య ఏడుకొండలు, అత్త భారతి ఉంటున్నారు. నందిని కొండ మీద నుంచి కిరాణా షాపునకు వచ్చి వెళ్తున్న సమయంలో వడ్డాది నరేష్ ఈవ్‌టీజింగ్ చేస్తున్నాడు. నిత్యం ఇదేరీతిన వేధింపులకు పాల్పడటంతో నందిని అత్తమామలకు విషయం చెప్పింది. అత్త భారతి, మామ ఏడుకొండలుతోపాటు బంధువులు కలిసి నరేష్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నరేష్ అతడు ఇంట్లో లేడు. నరేష్ భార్యకు నందినిని వేధిస్తున్న విషయం చెప్పారు. రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత నరేష్ ను అతడి భార్య ఈ విషయంపై ప్రశ్నించింది. దీంతో ఆగ్రహంతో ఇంటి నుంచి బయటకు వచ్చి నరేష్ తన అన్న వడ్డాది రమణకు ఇంట్లో జరిగిన విషయం చెప్పాడు. వారిద్దరూ కలిసి భూపతి మణి, రమణ, బొబ్బిలి పవన్, దలాయి లోకేష్, పైసా స్వరూ్‌పలను వెంటబెట్టుకుని కొండ మీద ఉన్న నందిని ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబసభ్యులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో నందినితోపాటు అక్కడ ఉన్న వారిపై దాడి చేశారు. పక్కనే చాకు ఉండడంతో రమణ, నరేష్ కలిసి అత్త భారతి, బంధువులు కుమార్, నాగరాజు చేతులపై ఇష్టానుసారంగా కోసేశారు. దీనిపై భారతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నరేష్, రమణ, భూపతి మణి, రమణ, బొబ్బిలి పవన్, దలాయి లోకేష్, పైసా స్వరూ్‌పలపై కేసు నమోదు చేశారు.