సైబర్ నేరగాళ్ళు రోజురోజుకూ కొత్త పంథాను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వారి వలలో చిక్కుకోవద్దని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ప్రజలకు సూచించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందన నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కువగా వరకట్నం, సరిహద్దులు, సివిల్ వివాదాలపై ఫిర్యాదులందాయి. ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని ఐదు లక్షలు తీసుకుని మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన ఓ వ్యక్తి కోరారు. పెట్రోల్ బంక్‌కు పర్మిషన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా రూ.50 వేలు తీసుకుని మోసం చేశాడని కొయ్యలగూడెం మండలం బయ్యనగూడేనికి చెందిన ఒకరు ఫిర్యాదు చేశారు. తన ఏటీఎం కార్డును మార్ఫింగ్ చేసి రూ.46 వేలు తస్కరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడానికి చెందిన ఒకరు కోరారు. తన ఇంటిని దహనం చేసిన విషయంపై కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రామవరానికి చెందిన ఒక మహిళ వాపోయింది. ఆన్‌లైన్‌లో ఐదు వేలు రుణం తీసుకుని వారంలో చెల్లించినా, ఇంకా కట్టాలంటూ వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. వీటిపై సత్వరం విచారణ జరిపి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర సంస్థల నుంచి బహుమతులు వచ్చాయని మోసం చేస్తున్నారని వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.