కఠిన చట్టాలు అమలులోవున్నా అగ్రరాజం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లోకి ఆయుధంతో ప్రవేశించిన ఓ ఆగంతకుడు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు యూనివర్సిటీలోకి చొరబడ్డాడు. క్యాంపస్‌లోని రెండు భవనాల వద్ద కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.
కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. అయితే, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందినట్టు యూనివర్సిటీ పోలీస్ విభాగం డిప్యూటీ చీఫ్ క్రిస్ రోజ్‌మన్ అన్నారు. అకడమిక్ బిల్డింగ్ బెర్కే హాల్, యూనివర్సిటీ యూనియన్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల ఆగంతకుడు కాల్పులు జరిపాడని తెలిపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వీరికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బెర్కే హాల్ వద్ద ఇద్దరు, యూనియన్ బిల్డింగ్ వద్ద ఒకరు చనిపోయారని వివరించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని, కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదని రోజ్‌మన్ అన్నారు. ఇంతకు ముందు యూనివర్సీటిలో ఇలాంటి ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. అనుమానిత నిందితుడు కాల్పుల జరిపిన నాలుగు గంటల తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. అమెరికాలో అతిపెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ఒకటి. కాల్పులు జరిగిన ఈస్ట్ లాన్సింగ్ క్యాంపస్‌లో 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజా ఘటన నేపథ్యంలో 48 గంటల పాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలను రద్దు చేసినట్లు యూనివర్సిటీ పోలీసులు వెల్లడించారు.
ఘటన జరిగిన మూడు గంటల తర్వాత వర్సిటీలోని కెమెరాల్లో రికార్డయిన అనుమానితుడి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. జీన్స్, జాకెట్ వేసుకుని, బేస్‌బాల్ క్యాప్ ధరించి, గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. మిచిగాన్ ఓక్లాండ్ కౌంటీ ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో 2021 నవంబరు 30న 15 ఏళ్ల బాలుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసింది. మళ్లీ 14 నెలల తర్వాత ఇప్పుడు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. నాటి ఘటనలో నలుగురు విద్యార్థులు చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.