నిత్య పెళ్లికొడుకు తరహాలో నిత్య ప్రేమికులు కూడా ఉంటారండి. ఈ ప్రేమికుడికి కూడా వారి ప్రియురాళ్లు అంతా కలసి తగిన విధంగా శాస్తీ చెప్పారు. అప్పటి వరకూ నువ్వే ప్రపంచమని, నువ్వు లేకుండా బతకలేనని చెప్పి చెట్టపట్టాలేసుకుని తిరిగి తీరా పెళ్లి అనేసరికి కొందరు ముఖం చాటేస్తారు. ఇలా మోసపోయినవాళ్లు తమ ప్రియుడు లేదా ప్రియురాలు వేరే పెళ్లి చేసుకుంటే పెళ్లిమండపం వద్ద గొడవకు దిగిన ఘటనలు పలు సందర్భాల్లో జరుగుతుంటాయి. తాజాగా, ఓ యువకుడి తమను మోసగించాడని పేర్కొంటూ పలువురు యువతులు కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఈ మహిళల పట్ల అతడి ప్రవర్తనను వ్యతిరేకిస్తూ అమ్మాయిలు చేపట్టిన ఆందోళన చైనాలో చోటుచేసుకుంది. అంతేకాదు, అతడ్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తేలేదని, జీవితాన్ని నాశనం చేస్తామంటూ మాజీ ప్రియురాళ్లు బ్యానర్లు ప్రదర్శిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని అక్కడి మీడియా వెల్లడించింది.
నైరుతి చైనాలోని యున్నన్ ప్రావిన్సులకు చెందిన చెన్ అనే యువకుడికి ఫిబ్రవరి 6న వివాహం జరిగింది. ఈ సమయంలో పెళ్లిమండపం వద్ద కొందరు యువతులను చూసి చెన్ షాకయ్యాడు. వాళ్లంతా తన మాజీ ప్రియురాళ్లు కావడం గమనార్హం. ‘మేం నీ మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేమంతా కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని రోడ్డుకు మధ్యలో వాళ్లు నిలబడ్డరు. వివాహానికి వచ్చిన అతిథులు దీన్ని ఆసక్తిగా గమనిస్తూ ఏం జరిగిందని ఆరా తీశారు.
ఈ పరిణామంతో ఆందోళన చెందిన వధువు, ఆమె కుటుంబసభ్యులు.. వరుడ్ని ఏం జరిగిందని నిలదీశారు. దీనిపై చెన్ వివరణ ఇస్తూ.. గతంలో తాను వారితో కలిసి తిరిగింది వాస్తమేనని అంగీకరించాడు. అంతేకాదు, వాళ్లు చేసిన పనికి తనకు ఏమాత్రం కోపం రావడం లేదని.. గతంలో ఓ చెడు బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్నది నిజమేనని ఒప్పుకున్నాడు. అప్పట్లో కుర్రతనం... మనసు పరిపక్వత లేనందున చాలా మంది అమ్మాయిలను బాధ పెట్టానని చెప్పాడు.
‘‘అమ్మాయిలను మోసం చేయొద్దని.. వారితో నిజాయతీగా ఉండాలి.. ఒకవేళ భవిష్యత్తులో ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే, మీరు బలవుతారు’’ సూచించాడు. అయితే, పెళ్లి సమయంలో వారు చేసిన పని కాస్త ఇబ్బంది పెట్టిందని.. కాబోయే భార్య కూడా తనతో గొడవపడిందని చెన్ వాపోయాడు. కానీ, వారితో బ్రేకప్‌కి దారితీసిన కారణాలను మాత్రం చెన్ బయటపెట్టలేదు. తాను చేసిన పనికి క్షమాపణలు కోరాడు.
ఇదిలావుంటే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అతడు పశ్చాత్తాపం చూపలేడు.. ఎందుకంటే అతను మనిషిలా ప్రవర్తించలేదు.. ‘చిరుతపులి తన మచ్చలను మార్చుకోదు’ అని మరొక వ్యక్తి వ్యాఖ్యానించాడు.‘‘సమస్య అతను డేటింగ్ చేసిన మహిళల సంఖ్య గురించి కాదు, కానీ అతను వారిని బాధపెట్టినందున.. లేకుంటే ఆయనకు గుణపాఠం చెప్పేందుకు వారు నిరసనలు చేయరు’’ అని కామెంట్లు పెట్టారు.