డబ్బులను ఏటీయం సెంటర్ నుంచి డ్రా చేసుకోవడానికి ఇబ్బంది పడే అమాయకులు, వృద్ధులను టార్గెట్ చేసి... వారిని మోసం చేసి ఏటీయం కార్డులను మార్చేసి పెద్ద ఎత్తున డబ్బులు డ్రా చేసుకునే ఏటీయం దొంగను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి తెలిపారు. మంగళవారం వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐలు మధుసూధన్‌రెడ్డి, సిద్దయ్యలతో విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. విజయవాడలోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్య చదువుతున్న చిత్తూరు జిల్లా నగరి మండలం, గొల్లకండ్రిగ గ్రామానికి చెందిన కోనేటి వెంకటేష్ జల్సాలకు బానిసయ్యాడు. చెడు మార్గాలకు అలవాటు పడిన వెంకటేష్ డబ్బును అడ్డదారుల్లో సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కనేవాడు. ఆన్‌లైన్ గేమింగ్‌లు ఆడుతూ లక్షలు సంపాదించాలన్న దురుద్దేశ్యంతో పథకం పన్నాడు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఏటీయం సెంటర్లకు డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయకులను, వృద్ధులను టార్గెట్ చేసుకున్నాడు. ఏటీయం సెంటర్లలో తచ్చాడుతూ వారికి మాయమాటలు చెబుతూ లౌక్యంగా వారి ఏటీయం కార్డులను దొంగలించి.. వాటి బదులు డమ్మీ ఏటీయం కార్డులను వారి చేతుల్లో పెట్టి.. తరువాత వాటి ద్వారా డబ్బులు డ్రా చేసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఏటీయం పోగొట్టుకున్న కడప రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉంటున్న సుబ్బరాయుడు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ సిద్దయ్య ఏటీఎం దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రాబడిన సమాచారం మేరకు ఎస్‌ఐ తన సిబ్బందితో వెళ్లి కడప అవుటర్ రింగ్ రోడ్డులో బెంగుళూరు ఫ్లై ఓవర్ వద్ద అనుమాస్పదంగా ఉన్న నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో కడప నగరంలోనే ఆరు చోట్ల నేరానికి పాల్పడి డబ్బులను ఆన్‌లైన్ గేమింగ్‌లో కోల్పోయినట్లు నిందితుడు తెలిపారన్నా రు. అతని వద్ద నుంచి 16 ఏటీఎం డెబిట్ కార్డులను, ఒక మొబైల్ ఫోన్, రూ.4వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు .