విజయనగరం జిల్లా, గజపతినగరం పరిధిలోని గంగచోళ్లపెంట గ్రామంలో చెట్టుపై నుంచి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ సీహెచ్ గంగరాజ్ తెలిపిన వివరాలు ప్రకారం..... గంగచోళ్లపెంట గ్రామానికి చెందిన ముంత అడవయ్య(50) అనే కల్లు గీతకార్మికుడు వృత్తిలో భాగంగా గ్రామం శివారునగల తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా కాళ్లు జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అడవయ్యను 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య కిష్టమ్మ, ఇద్దరు పిల్లలు ఈశ్వరరావు, గణేష్ ఉన్నారు.