మహాశివరాత్రి బహ్మోత్సవాలకు దూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. శుక్రవారం దారి పొడవునా భక్తుల శివనామ స్మరణతో నల్లమల ప్రతిధ్వనిస్తున్నది. పెరుగుతున్న ఎండలను లెక్కచేయకుండా పిల్లాపాపలతో హరహర మహాదేవ. అంటూ సాగిపోతున్నారు. వెంకటాపురం నుంచి పంటపొలాల గుండా నాగలూటి చెంచుగూడేన్ని చేరుకుని ఆ తర్వాత 5 కిమీల అటవీ మార్గంలో ప్రయాణించి నాగలూటి వీరభద్రాలయానికి సందర్శించి అక్కడి నాగలూటి తిప్పలు, దామర్లకుంట, నల్లమల కొండలపై అడవిమార్గం గుండా సుమారు 14 కి. మీ భక్తులు ప్రయాణించి పెచ్చెర్వు చెంచుగూడేన్ని చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కత్తుల కొండ, కోర్కెలకొండ అటవీ ప్రాంతంలో 16 కి. మీ ప్రయాణిస్తే. భీముని కొలను ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి ప్రమాదకర జారుడు కొండపై ప్రయాణించి కైలాస ద్వారానికి చేరుతున్నారు. అక్కడి నుంచి 6కిమీల దూరం ప్రయాణించి శ్రీశైల మల్లన్న దర్శనానికి తరలివెళ్తున్నారు. నిర్విరామంగా పాదయాత్రలోని అలసటను, కష్టాలను శివనామ స్మరణతో అధిగమిస్తున్నారు.