ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలోని శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఆలయంలో రెండు శివలింగాలు ఉండగా.. ఒక శివలింగం ఏడాదిలో 11 నెలలు నీటిలోనే ఉంటుంది. ఏటా వైశాఖ మాసంలో మాత్రమే కోనేటిలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలూ, అభిషేకాలు చేస్తారు. ఈ శివలింగం ఏడాదిలో 11 నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత కాగా ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి కొన్ని వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు.