జనసేన అధ్యక్షుడు, తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌ను కలిసి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్న ఆ చిన్నారి ఇకలేదు. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందింది. కన్నతల్లికి తీవ్ర వేదన మిగిల్చింది. రేవతి.. 4 ఏళ్ల కిందట ఈ చిన్నారి పేరు మీడియాలో మార్మోగింది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ వద్దకు ఓ నిరుపేద కుటుంబం వచ్చింది. తమ చిన్నారి అరుదైన వ్యాధితో పోరాడుతోందని, ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని ఆమె తల్లి చెప్పారు. అది విన్న పవన్ కళ్యాణ్ ఆ పాపను అక్కున చేర్చుకున్నారు. తన ఒళ్లో కూర్చోబెట్టుకొని కాసేపు మాట్లాడారు. నవ్విస్తూ, నవ్వుతూ ఆడించారు.
చిన్నారి రేవతి పరిస్థితి చూసి నాడు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆమెకు ఆర్థిక సాయం చేశారు. మస్క్యులర్ డిస్ట్రోపి వ్యాధితో నరాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ జీవచ్ఛవంలా మారుతున్న ఆ చిన్నారికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ కూడా కొనిచ్చారు. ఆ తర్వాత ఆ చిన్నారిని కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఓ ఆశ్రమంలో చేర్పించారు.
చిన్నారికి అందిన చికిత్స, ఆశ్రమంలో వసతులు చూసి ఆమె తల్లికి ఆశలు చిగురించాయి. అంతా సంతోషంగా ఉంది, చిన్నారి కోలుకుంటుంది అని భావించారు. అయితే, చివరికి ఆ తల్లి ఆశలు అడియాసలే అయ్యాయి. కండరాల్లో పటుత్వంలేక ఇబ్బందిపడుతూ.. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది.