ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జవాన్ ఇంటిపై అనుచరులతో డీఎంకే నేత దాడి

national |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 08:21 PM

దాడిలో చనిపోయిన తన తమ్ముడికి న్యాయం జరిగేలా ఓ సైనికుడు శపథం తీసుకొన్నాడు. ఇదిలావుంటే నీళ్ల ట్యాంకు వద్ద బట్టలు ఉతికే విషయంలో వాగ్వాదం మొదలై చివరకు సైనికుడిపై ప్రజాప్రతినిధి తన అనుచరులతో దాడికి పాల్పడి అతడి మరణానికి కారణమైన ఘటన తమిళనాడులోని కృష్ణగిరిలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ ఘటన తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్మీ జవాన్‌ ప్రభు సోదరుడు ప్రభాకర్ కూడా ఈ దాడిలో గాయపడ్డాడు. తమకు న్యాయం చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. అతడు సైనికుడు కావడంతో తన తమ్ముడిని చంపిన వారిని శిక్షించేంత వరకూ తాను విధుల్లో చేరబోనని ప్రతిజ్ఞ‌ చేశాడు.


‘‘నా తమ్ముడ్ని చంపిన వారిని శిక్షించేంత వరకు నేను ఆర్మీలోకి తిరిగి వెళ్లను.. వారికి శిక్ష పడే వరకు విధుల్లో చేరను.. మేమేమీ తప్పు చేయలేదు.. 13 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తూ నెల రోజుల కిందట సెలవుపై ఇక్కడకు వచ్చాను. మా సోదరుడ్ని చంపిన డీఎంకే కౌన్సిలర్ చిన్నసామి‘నువ్వు భారత సైన్యంలో పనిచేస్తూ ఉండొచ్చు కానీ నన్ను ఏమీ చేయలేవు’ అంటూ బెదిరిస్తున్నారు’’ అని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు హత్య ఎలా జరిగిందనే ప్రభాకర్ వివరించారు. తొలుత చిన్నసామినే గొడవ ప్రారంభించాడని తెలిపారు


‘ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు మేము బట్టలు తీసుకుని నీళ్ల ట్యాంక్ దగ్గరకు వెళ్లాం.. అప్పటికే కొందరు బట్టలు ఉతుకుతున్నారు.. కానీ కౌన్సిలర్ చిన్నసామి వారిని ఏమీ అనలేదు.. నేరుగా మా దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బట్టలు తీసివేయాలని చెప్పడంతో నేను సరే అన్నాను.. మిగతావాళ్లు అక్కడ బట్టలు ఉతుకుతున్నప్పుడు, కార్లు కడుగుతున్నప్పుడు లేని సమస్య మనకే ఎందుకుని మా అమ్మను అడిగాను.. దాంతో, కౌన్సిలర్ నన్ను నొటికొచ్చినట్టి తిట్టి.. చెప్పు చూపించి కొడతానని బెదిరించాడు..


పక్కన ఉన్న కొందరు సర్దిచెప్పి ఆపడంతో మేం అక్కడి నుంచి వెళ్లిపోయాం.. కానీ, ఆ రోజు సాయంత్రం చిన్నస్వామి తన అనుచరులను వెంటేసుకుని మా ఇంటికి వచ్చాడు.. స్నేహితుడితో మాట్లాడుతున్న మా నాన్నపై కత్తితో దాడి చేశాడు. ఆయన తలకు గాయమై రక్తమోడుతూ కిందపడిపోయారు.. అడ్డుకునే ప్రయత్నం చేసిన నన్ను ఆరుగురు వ్యక్తులు నన్ను పట్టుకుని పక్కకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత నా తమ్ముడి ప్రభు తల వెనుక భాగంలో కొట్టారు.. అతడి స్పృహ‌త‌ప్పి పడిపోయినా కానీ కొడుతూనే ఉన్నారు.. కత్తులతో దాడి చేసి పొడి చంపేశారు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.


మరోవైపు, ఈ హత్యలో అధికార పార్టీ కౌన్సెలర్‌కు ప్రమేయం ఉండటంతోనే పోలీసులు తాత్సారం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఎస్పీ సరోజ్‌కుమార్ ఠాకూర్ తోసిపుచ్చారు. ప్రభు మృతిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఇది దాడి కేసు అన్నారు. హతుడు ప్రభు, ప్రధాన నిందితుడు చిన్నసామి బంధువులని ఠాకూర్ తెలిపారు. ప్రభు తల్లి కన్నామల్‌కు చిన్నసామి స్వయానా బాబాయి అని, ఆయన సోదరుడు రామసామి కుమార్తె అని చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com