ఎన్నికల్లో గెలిచేందుకు కోటి వేషాలు అన్నట్లుగా మన దేశ రాజకీయాలు సాగడం సహజం. త్వరలోనే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా, ఇందుకు కర్ణాటక అసెంబ్లీ వేదికైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నిరసన చేపట్టడం చర్చనీయాంశమైంది. ఆర్ధిక శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చూస్తుండటంతో శుక్రవారం బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సీఎం బొమ్మై సిద్ధమైన సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అప్పటిదాకా ఏదో చదువుకుంటూ కూర్చున్న ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వెంటనే కాషాయ రంగు పువ్వు తీసుకుని తను చెవిలో పెట్టుకున్నారు. అనంతరం మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వారి చెవుల్లో పూలు పెట్టుకున్నారు.
సిద్ధరామయ్య చెవిలో పువ్వు పెట్టుకోవడం గమనించిన బొమ్మై.. కాంగ్రెస్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఇంతకాలం ప్రజల చెవుల్లో కాంగ్రెస్ నాయకులు పువ్వు పెట్టారు. అందుకే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు చెవిలో పువ్వు పెట్టారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు కన్నడిగులు కచ్చితంగా చెవిలో పూలు పెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల చెవిలో పూలు చూడముచట్టగా ఉన్నాయని సెటైర్లు వేశారు.
బొమ్మై వ్యాఖ్యలకు సిద్ధూ సైతం కౌంటర్ ఇచ్చారు. ‘‘మీరు ఏడు కోట్ల మంది కర్ణాటక ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు. ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చలేదు. మీరు ప్రజల చెవిలో పువ్వు పెడితే.. మేము మా చెవిలో పువ్వులు పెట్టుకున్నాం’’ అని అన్నారు. గత బడ్జెట్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు, చెవిలో పువ్వు హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది.