కొందరికి వాహనాల ఫ్యాన్సీ నెంబర్ పై పెద్ద మోజు ఉంటుంది. అలాంటి కోరికను తీర్చుకోవడానికి కోట్ల రూపాయలు గుమ్మరించడానికైనా వెనకాడరు. ‘లక్ష రూపాయలు పెట్టి స్కూటీ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి.. కోటి 12 లక్షల రూపాయలు పెట్టి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని కోట్ఖాయిలో ఓ వ్యక్తి స్కూటీని కొనుగోలు చేశాడు. దానికి HP 99-9999 అనే ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ దక్కించుకోవాలని భావించాడు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ జరగ్గా.. ఆ నంబర్ కోసం మొత్తం 26 మంది పోటీపడ్డారు. సాధారణంగా ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ రూ.70 వేల నుంచి రూ.1.80 లక్షల వరకు పలుకుతుంది. బిడ్డింగ్ రిజర్వ్ ధర రూ.1000 నుంచి మొదలవుతుంది. కానీ పోటీ ఎక్కువగా ఉండటంతో.. అత్యధికంగా రూ.1,12,15,500కు బిడ్ దాఖలైంది. అంత భారీ మొత్తానికి బిడ్ దాఖలు చేసిందెవరనే విషయాలు మాత్రం తెలియరాలేదు.
ఒక వేళ భారీ ధరకు బిడ్ దాఖలు చేసిన వ్యక్తి డబ్బు చెల్లించలేకపోతే.. రెండో అత్యధిక మొత్తం బిడ్ దాఖలు చేసిన వ్యక్తికి ఆ నంబర్‌ను కేటాయిస్తారు. లక్ష రూపాయల బండికి ఫ్యాన్సీ నంబర్ కోసం కోటి రూపాయలకుపైగా చెల్లించడానికి బిడ్ దాఖలు కావడం పట్ల సంబంధిత అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోటీ నుంచి మిగతా వారిని తప్పించేందుకు కూడా ఇలా చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఒక వేళ బిడ్డింగ్ అమౌంట్‌ను జమ చేయకపోతే.. పెనాల్టీ విధించేలా రూల్స్ మార్చాలని చెబుతున్నారు. బిడ్ దాఖలు చేసిన మొత్తంలో 30 శాతం డిపాజిట్ చేయాలనే నిబంధన తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీని వల్ల భారీ మొత్తంలో బిడ్డింగ్ దాఖలు చేసి.. తర్వాత కనిపించకుండా పోయే వారి బాధ తప్పుతుందంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లాంటి పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో స్కూటీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. షిమ్లా, లోవ్నేష్ లాంటి ప్రాంతాల్లో కోవిడ్ ముందు నాటితో పోలిస్తే స్కూటీల అమ్మకాలు 30-40 శాతం పెరిగాయి.