తను మళ్లీ చోడవరం వచ్చేసరికి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మంత్రి అవుతారని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ జోస్యం చెప్పారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఆలీ పర్యటించారు. స్వయంభు గౌరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక స్వయంభూ గౌరీశ్వరాలయంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అలీ చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు ధర్మశ్రీ ఎమ్మెల్యేగా ఉన్నారని.. మళ్లీ ఇప్పుడు వచ్చానని.. ఇప్పుడు ప్రభుత్వ విప్‌గా ఉన్నారన్నారు. ఈసారి తాను వచ్చేసరికి మంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. కచ్చితంగా జరిగి తీరుతుందన్నారు.
42 సంవత్సరాల సినీ జీవిత ప్రయాణంలో ప్రేక్షకులు తనకు దేవుడు లాంటి వాళ్ళని.. ఇప్పటి వరకే 1200 పైచిలుకు సినిమాల్లో నటించానని చెప్పారు. అందరి అభిమానమే ఇంతవరకు తీసుకొచ్చిందని అలీ తెలిపారు. అనంతరం అలీని ప్రభుత్వ విప్ ధర్మశ్రీతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక మైనారిటీ సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
అలీ గురువారం రాత్రి చోడవరం నుంచి రోలుగుంట వెళుతున్న అలీ.. మధ్యలో వడ్డాది జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు. ఈ విషయం తెలుసుసుకున్న పలువురు కూడలికి వచ్చారు.. అక్కడ అలీతో సెల్ఫీలు దిగారు. స్థానిక ముస్లింలు, వైఎస్సార్‌సీపీ వడ్డాది అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి తదితరులు అలీకి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.