గుంటూరు జిల్లా రాజకీయాలు కాస్త హీట్ ఎక్కాయి. ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పయనంపై చర్చ జరుగుతోంది. బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన ఏ పార్టీలోకి వెళతారనే ఉత్కంఠ నడుస్తోంది. ఈ నెలాఖరులో టీడీపీలో చేరతారని చెబుతున్నా.. ఆయన మాత్రం త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెబుతున్నారు. అయితే కన్నా బీఆర్ఎస్లోకి రావాలని స్వాగతం పలికారు మాజీ మంత్రి, ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు బీజేపీలో లక్ష్మీనారాయణతో కలిసి అనేక పోరాటాలు చేశామని.. సోము వీర్రాజు బీజేపీని సర్వనాశనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాబోయే రోజుల్లో బీజేపీ కనుమరుగువుతుందని.. ఏ నాయకుడైనా బీఆర్ఎస్లోకి ఆహ్వనిస్తామన్నారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీ కి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేస్తున్నారన్నారు. కేసీఆర్ అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారని.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కీలకంగా మారబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని.. అలాగే పొత్తులు ఎవరితో ఉంటాయనేది భవిష్యత్తు లో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
కేసీఆర్ తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేసుకోవాలని జగన్, చంద్రబాబుకు సూచించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మాటలు పెడచెవిన పెట్టడం వల్లే ఈ రోజు ఏపీ రాజధాని లేని రాష్ట్రమైందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ఏపీలో యువతకు ఉపాధి లేకుండా పోయిందని..ఒక చేత్తో సర్టిఫికెట్లు, మరో చేత్తో పొట్ట పట్టుకుని ఆంధ్రప్రదేశ్ యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. అమరావతి రాజధానిగా ఉంచాలని బీఆర్ఎస్ నిర్ణయమని.. మంగళగిరి ప్రాంతంలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.