చంద్రబాబు తప్పిదాల కారణంగా.. తీవ్ర నష్టం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్ల జరిగిన నష్టాలను తాము పూడ్చుతున్నామని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ కింద అత్యధికంగా ఖర్చు చేసింది జగన్ ప్రభుత్వమే అని ఆయన వివరించారు. చంద్రబాబు హయాంలో షోవర్క్ తప్ప మరేమీ లేదని అంబటి రాంబాబు ఆరోపించారు.
'చంద్రబాబుకు ప్రచారయావ తప్ప మరొకటి లేదు. టీడీపీ హయాంలో పోలవరాన్ని సర్వనాశనం చేశారు. కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. దీని వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిది. దీని విలువ రూ.400 కోట్లు. దీనికి బాధ్యత చంద్రబాబుది కాదా? దీనిపై ఎన్ హెచ్ పీసీ నిపుణుల కమిటీ నివేదిక త్వరలో వస్తుంది. ఆ నివేదికను బట్టి పాతదే ఉంచాలా? కొత్తది నిర్మించాలా అనేది తేలుతుంది. కొత్తది నిర్మించాలంటే రూ.400 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశముంది. పోలవరంలో చంద్రబాబు చేసిన నష్టాల విలువ రూ.3వేల కోట్లు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది' అని అంబటి రాంబాబు ఆరోపించారు.
'చంద్రబాబు నిర్వాకంతో పోలవరం పూర్తిగా దెబ్బతింది. పోలవరం సోమవారం అంటూ.. చంద్రబాబు పోలవరాన్ని సర్వనాశనం చేశారు. పోలవరానికి గేట్లు పెట్టకుండా.. రేకులు అడ్డంపెట్టిన చరిత్ర చంద్రబాబుది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోంది. చంద్రబాబు చేసిన నష్టాలను పూడ్చడానికి.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్ అండ్ ఆర్‌పై చంద్రబాబు హయాంలో ఖర్చు చేయలేదు. వైఎస్ జగన్ పాలనలో ఖర్చు చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై చంద్రబాబు ఎందుకు దృష్టి పెట్టలేదు. కమీషన్లు రావు కనుక ఆయన పట్టించుకోలేదు' అని అంబటి రాంబాబు ఆరోపించారు.