ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఫేవరేట్ హీరోయిన్ శ్రీదేవి...'నిజం విత్ స్మిత' లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 08:29 PM

అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఫేవరెట్ రాజకీయ నేత అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నటి శ్రీదేవి తన ఫేవరెట్ హీరోయిన్ అని.. ఎన్టీఆర్ నటుడిగా కంటే పొలిటిషీయన్‌గా ఇష్టమన్నారు.. తనను అన్నింటికంటే అమరావతి విషయం చాలా బాధించిందన్నారు. పవన్ కళ్యాణ్ సమాజానికి ఏదో చేయాలనే తపన పడతారని.. లోకేష్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేటీఆర్ స్ట్రాటజీ, అనుకున్నది సాధించేందుకు పనిచేసే వ్యక్తి, బెస్ట్ కమ్యునికేటర్ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు వెళతారు.. ప్రజల్లో ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉందన్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబువెన్నుపోటు ఆరోపణలపై సింగర్ స్మిత్ టాక్‌ షో.. 'నిజం విత్ స్మిత' లో ఆసక్తికర విషయాలను చెప్పారు. '1994 ఎన్నికల తర్వాత సీనియర్ నేతలు, పార్టీలో ఉండేవాళ్లు నిర్లక్ష్యం చేశారు.. ఎవరికి వారే ఇష్టానుసారం చేశారు.. కొన్ని అవమానాలు జరిగాయి. అటు కుటుంబం.. అటు పార్టీ లాభం లేదు అనుకున్నాం. నేను, ఎన్టీఆర్, మోహన్ రెడ్డి కూర్చున్నాం.. మనం కరెక్ట్ చేసుకోకపోతే చేజారి పోతుందని చెప్పాం.. కానీ చాలా కారణాల వల్ల కుదరలేదు' అని వివరించారు.


అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పా, ఒప్పా అని ఆలోచిస్తే.. ఈరోజు ఆయన బొమ్మ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుజాతికి తెలుగు దేశం పార్టీని శాశ్వతంగా అందిస్తున్నామంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కారణమన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని.. ఆ రోజు ఇలాంటి సంఘటనలకు కారణమైనవారు ఎక్కడున్నారో.. ఏ పార్టీలో ఉన్నారో అందరికి తెలుసని.. వాళ్ల పేర్లు తాను చెప్పనన్నారు. కొన్ని కొన్ని నిర్ణయాలు తాను చెప్పలేనని..


ఒక పక్క నాయకుడి ఇమేజ్, మరో పక్క పార్టీ ప్రయోజనాలు ముఖ్యమన్నారు. అంతర్గతంగా పార్టీలో జరిగింది.. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తర్వాత కూడా ఆయన ఫోటోనే పెట్టి ముందుకు పోతున్నాం.. తెలంగాణ సీఎం కూడా భాగస్వామి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


తాను బిల్ గేట్స్‌ను ఢిల్లిలో కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. ముందు ఆయన్ను కలవాలని కోరానని.. ఆయన రాజకీయనేతలతో పనిలేదు కలవను అనడంతో బాధపడ్డానన్నారు. కానీ ఆ తర్వాత కాక్‌టైల్ పార్టీకి రమ్మన్నారు.. తాను కూడా తాగుతున్నాని, ఆ ఖాతాలో వేస్తారని రానని చెప్పినట్లు అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఒక్క పది నిమిషాలు మాట్లాడాలని సమయం అడిగానని.. ఆ తర్వాత కలిసేందుకు ఓకే చెప్పారన్నారు. 'వారం పాటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం ప్రిపేర్ అయ్యాను.. విన్న తర్వాత ఏం కావాలని బిల్‌గేట్స్ నన్ను అడిగారు. ఐటీలో ఇండియా బలంగా ఉంది.. మైక్రో సాఫ్ట్ పెట్టమని అడిగాను. ఇప్పట్లో పెట్టలేను అన్నారు.. ఆ తర్వాత వరుసగా కలిశాక హైదరాబాద్‌కు వచ్చేందుకు ఒకే చెప్పారు' అంటూ గతంలో జరిగిన విషయాన్ని వివరించారు.


రాష్ట్ర విభజన తర్వాత 2014కు తెలంగాణకు వనరులు ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతంతామాత్రంగానే ఉందన్నారు. ఏపీలో కూడా ప్రజలకు సంక్షేమం, డెవలప్‌మెంట్ చేయకపోతే నష్టపోతారని ఆలోచనతో రూ.86వేల కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైతే.. 51శాతం సంక్షేమానికి కేటాయించామన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి మనిషి చనిపోయిన తర్వాత గౌరవప్రదంగా వీడ్కోలు చెప్పే విధంగా కార్యక్రమాలు చేశామన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించామని.. ఇప్పుడేమో బోగస్ సంక్షేమం అని విమర్శించారు. ఏపీకి కూడా విజన్ 2029ని తయారు చేశామని.. అప్పటికి ఏపీ నంబర్ వన్‌గా ఉండాలని ఓ మిషన్ తయారు చేశామన్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైన విషయాన్ని గుర్తు చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com