నరసరావుపేటలో పెద్ద ప్రమాదం తప్పింది. నరసరావుపేట మండలంలోని గురవాయపాలెంలో.. మహా శివరాత్రి సందర్భంగా 110 అడుగుల ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేశారు. ఈ ప్రభను పైకి ఎత్తే క్రమంలో అది విరిగిపోయింది. సుమారు 30 లక్షలు వ్యయంతో ఈ ఎలక్ట్రికల్ ప్రభ నిర్మించారు. ప్రభను పైకి లేపుతుండగా ఒకసారిగా విరిగిపోవడంతో.. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో చుట్టుపక్కల ఉన్న ప్రజలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎవ్వరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అటు కోటప్పకొండలో జరగనున్న మహాశివరాత్రి తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్టు.. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి వివరించారు. 2500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 25 మీటర్లకు ఒక పోలీసును భద్రత నిమిత్తం ఉంచామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. మార్గమధ్యలో ఆగిపోయిన వాహనాలను తొలగించటానికి.. జేసీబీలు, ప్రొక్లైనర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
నరసరావుపేట నుంచి కోటప్పకొండ వెళ్లడానికి.. యలమంద, గురవాయపాలెం నుంచి వచ్చేవారు స్నానాల ఘాట్ పక్కన నర్సరీ మార్గం ద్వారా, యాదవుల సత్రం పక్కన ఉన్న జనరల్ పార్కింగ్‌కు చేరుకోవాలని ఎస్పీ సూచించారు. నరసరావుపేట వెళ్లడానికి చిలకలూరిపేట మేజరు కెనాల్‌పై ఏర్పాటు చేసిన రూట్‌లో మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు. గురవాయపాలెం, యలమంద మీదుగా అనుమతి లేదన్నారు. వీఐపీ పాసు ఉన్నవారు, నరసరావుపేట వైపునుంచి వచ్చేవారు పెట్లూరివారిపాలెం గ్రామం మీదుగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే కొండపైకి చేరుకోవాలని సూచించారు.
చీరాల, బాపట్ల, గుంటూరు, ఒంగోలు నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తులు.. చిలకలూరిపేట, పురుషోత్తమపట్నం, పోతవరం, మద్దిరాల, ఎడవల్లి, యూటీ జంక్షన్, శారదా ఫార్మసీ కళాశాల వద్ద పార్కింగ్‌కు చేరుకోవాలని ఎస్పీ రవిశంకర్ రెడ్డి సూచించారు. కోటప్పకొండ నుంచి చీరాల, బాపట్ల, గుంటూరు, ఒంగోలు, చిలకలూరిపేట వెళ్లేవారు యూటీ జంక్షన్ నుంచి కట్టుబడివారిపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల మీదుగా.. చెరువు రోడ్డులో చిలకలూరిపేట మీదుగా వెళ్లాలని స్పష్టం చేశారు. సంతమాగులూరు మండలం, అద్దంకి మండలం నుంచి స్వామి దర్శనానికి వచ్చే వారు.. మన్నెపల్లి, లక్ష్మీపురం, పెట్లూరివారిపాలెం మీదుగా.. ఘాట్ రోడ్డు పక్కన ఉన్న జనరల్ పార్కింగ్‌కు వెళ్లాలని వివరించారు.